పోటీ పరీక్షల కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ప్రవల్లిక (Pravalika) సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ (Big Twist) చోటు చేసుకుంది. ఓ యువకుని వేధింపుల వల్లే తన కూమార్తె ప్రవల్లిక ఆత్మహత్య (Suicide) చేసుకున్నదని ఆమె తల్లి విజయ వెల్లడించారు. శివరామ్ అనే యువకుడి వేధింపులకు తాళలేక తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తెలిపారు. తన కూతురు ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రవళిక తల్లి, సోదరుడు కోరారు.
రెండేండ్లుగా తను బిడ్డను తాను హైదరాబాద్ లో చదివించుకుంటున్నానని చెప్పారు. తన కొడుకు కూడా హైదరాబాద్ లో చదువుకుంటున్నాడని పేర్కొన్నారు. తాము ఎండనక, వాననక కాయ కష్టం చేసి తమ పిల్లలను చదివించుకుంటున్నట్టు చెప్పారు. తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని చెప్పి వాళ్లకు ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నామని పేర్కొన్నారు.
కానీ శివరామ్ అనే వ్యక్తి తన బిడ్డను వేధించాడని అన్నారు. వాడి వేధింపులకు తాళలేక పోయిందన్నారు. కనీసం ఆ విషయాన్ని తన కూతురు తమతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. తన కుమార్తె చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తన బిడ్డకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని అన్నారు.
దయ చేసి తన కూతురి మరణాన్ని రాజకీయం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మీకు పార్టీల పరంగా ఏదైనా వుంటే మీరు మీరు చూస్కోవాలంటూ రాజకీయ పార్టీలకు సూచించారు. అంతే కానీ తమ కుటుంబాన్ని దయచేసి రాజకీయాల్లోకి లాగవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. తన బిడ్డ మరణానికి కారణమైన వ్యక్తిని మాత్రం మాత్రం బయటకు రానివ్వకండన్నారు. తన బిడ్డ మాదిరిగానే వాడికి శిక్ష వేయాలన్నారు.
హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ మర్రి ప్రవల్లిక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గత వారం ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గ్రూపు-2 పరీక్షలు వాయిదా పడటంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రవళిక మరణంపై ఆమె తల్లి, సోదరుడు మీడియా ముఖంగా స్పష్టత ఇచ్చారు.