ఏపీ కేబినెట్ సమావేశం ( Cabinet Meeting) బుధవారం జరిగింది. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది.
సుమారు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అటవీ శాఖలో 689 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. ఆర్జేయూకేటీ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పని చేసే నాన్ టీచింగ్ సిబ్బందిని 60 నుంచి 62కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు మంత్రి వర్గం ఓకే చెప్పింది. దీంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు అమోద ముద్ర వేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ఇంధన రంగంలో రూ. 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు.. ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు, దాదాపు 12,065 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.