ఏపీ (AP) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దూకుడుగా సాగుతోంది. వైసీపీ (YCP) ఓటమి లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోంది. టీడీపీ (TDP), జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వం ధ్వజమెత్తారు.. పెడనలో జరిగిన రోడ్ షో అనంతరం ఇద్దరూ బహిరంగ సభలో మాట్లాడారు. ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులకు వెళ్లామని తెలిపిన పవన్.. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని పేర్కొన్నారు..
వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.. రాక్షస పాలనను తరిమికొట్టాలని ఓటర్లకు పవన్ (Pawan) పిలుపునిచ్చారు. కలిసికట్టుగా శ్రమించి విజయానికి దారి చేసుకోవాలని.. ఇందుకు ప్రజల్లోకి వెళ్లాలని జనసేన (Janasena), టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపిన జనసేనాని.. రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం స్థాపిద్దామని పిలుపు ఇచ్చారు..
మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandra Babu) మాట్లాడుతూ.. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు.. సీఎంపై గులకరాయి ఘటనలో వైసీపీ నీచమైన డ్రామా ఆడి పరువు తీసుకొందని విమర్శించారు.. ఈ కేసులో బోండా ఉమను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని.. వారి కుట్రలను తిప్పికొట్టే రోజు దగ్గరలో ఉందని పేర్కొన్నారు..
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ వారిలో ఉన్న కుతంత్రాలు బయటికి వస్తున్నాయని ఆరోపించిన చంద్రబాబు.. హత్యాయత్నం అంటూ టీడీపీపై బురద చల్లాలని చూస్తున్నట్లు తెలిపారు.. మరోవైపు వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులు, మైనర్లను పోలీసులు తీసుకువెళ్ళడం సరికాదని సూచించారు.. ఏపీలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై ఈసీ దృష్టి పెట్టాలని కోరిన బాబు.. అధికార పక్షం పోలీసులతో తప్పులు చేయిస్తున్నారని మండిపడ్డారు..
ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థులు, ముఖ్యనేతలను కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు అధికారులను హెచ్చరించిన టీడీపీ అధినేత.. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా జూన్ 4 తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు..