తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( KCR)ను ఏపీ సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) పరామర్శించనున్నారు. జూబ్లిహిల్స్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ని సీఎం జగన్ రేపు కలవనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల ఫామ్ హౌస్‌లో గాయపడిన మాజీ సీఎం కేసీఆర్ ను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించారు.
గత నెల 7న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కేసీఆర్ కిందపడ్డారు. దీంతో ఆయన ఎడమ తుంటికి గాయం అయింది. ఆయన్ని కుటుంబ సభ్యులు హుటహుటినా సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
కొద్ది రోజుల క్రితం కాస్త కోలుకోవడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఇటీవల ఆయన స్ట్రెచర్ సహాయంతో నడుస్తున్నట్టు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఆయన యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందిన సమయంలో పలువురు ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను చంద్రబాబు ఆరా తీశారు.