జనం అంతా సంక్రాంతి జరుపుకొంటుంటే.. ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం పొత్తులు, అభ్యర్థుల లిస్టులు, ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెల 25వ తేదీ టార్గెట్‌గా అన్ని పార్టీలు సమరానికి సిద్దం అవుతోన్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు లిస్టుల విడుదలతో దూకుడుగా ఉన్న వైసీపీ.. పండుగ తర్వాత నాల్గో లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే టీడీపీ (TDP) మాత్రం ఇంకా టికెట్లను అధికారికంగా ప్రకటించలేదు.
రెండో సారి అధికారంపై గురి పెట్టిన వైసీపీ (YCP).. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది. అటు ప్రచారంలో స్పీడ్ పెంచేలా ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతోన్నారు ఏపీ (AP) సీఎం జగన్ (CM Jagan).. 26 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి.. లీడర్లు నుంచి కేడర్ దాకా అందరిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. విశాఖ (Vishakha) భీమిలి తొలి సమావేశానికి వేదిక కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు నిర్వహించాలనే ప్లాన్ లో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ వేగవంతమైంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటం వల్ల మేనిఫెస్టో ఫైనల్ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతోన్నారు. పండుగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీకి అంత గెలుపు ధీమా ఉంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయడంలేదని, జనసేనతో కలసి వస్తున్నారు అంటే వైసీపీ బలం అయినదని అంగీకరిస్తున్నారు కదా అని కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు..
మరోవైపు ఎన్నికలకు ఒంటరిగా వెళ్లినా, పొత్తుతో వెళ్లినా.. ఏపీలో తాము ఎదగాలని, బలమైన నాయకులను తయారు చేయాలని బీజేపీ (BJP) టార్గెట్ పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. ఈనెల 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన తరువాత రోడ్‌మ్యాప్ రావొచ్చని ఏపీ బీజేపీ భావిస్తోంది. తెలంగాణ ఫార్ములాతో ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ (Congress) సైతం కొత్త వ్యూహాలతో పావులు కదుపుతోంది..
ఇందులో భాగంగా వైసీపీ, టీడీపీ అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలామంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇటు అధికారంలో ఉన్న వైసీపీ, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య భీకర పోటీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్ కొంత పోటీ ఇచ్చినా.. బీజేపీ మాత్రం నామ మాత్రంగా ఉంటుందనే చర్చలు జరుగుతోన్నాయి..