Telugu News » AP : హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. ఆంధ్రాకి కొత్త చీఫ్ సెక్రెటరీ..?

AP : హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. ఆంధ్రాకి కొత్త చీఫ్ సెక్రెటరీ..?

చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభ సైతం గడబిడగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి.. ఇదంతా మోడీ సభలో చోటు చేసుకోవడంతో.. ప్రధాని కూడా సీఎస్‌పై సీరియస్ అయినట్లు సమాచారం.

by Venu

– వివాదాలకు కేంద్ర బిందువుగా సీఎస్ జవహర్ రెడ్డి
– వైసీపీకి అంటకాగుతున్నారని ఆరోపణలు
– కేంద్రానికి వరుసగా అందుతున్న ఫిర్యాదులు
– ఏ క్షణంలోనైనా వేటు పడే అవకాశం
– కొత్త సీఎస్ గా ఆర్‌పీ సిసోడియా?
– జగన్ సర్కార్ పై రివెంజ్ ఉంటుందా..?
– ఢిల్లీ వర్గాల్లో ఒకటే చర్చ

ఏపీ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇదే సమయంలో అధికార యంత్రాంగంలో కీలక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులపై వేటు పడింది. తాజాగా జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్ రెడ్డిపై వేటు పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించి, మరో అధికారిని నియమించబోతున్నారని తెలుస్తోంది.

రానున్న ఎన్నికల్లో సీఎస్ జవహర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం గంపెడు ఆశలు పెట్టుకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన విపక్షాలకు టార్గెట్ అయ్యారు. అదీగాక ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని పర్యటించిన సమయంలో సరైన ఏర్పాట్లు చెయ్యలేదనే ఆరోపణలు వచ్చాయి. చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభ సైతం గడబిడగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా మోడీ సభలో చోటు చేసుకోవడంతో ప్రధాని కూడా సీఎస్‌పై సీరియస్ అయినట్లు సమాచారం. ఇదేకాకుండా పెన్షన్లను పంపిణీ, పెన్షనర్లను ప్రభుత్వ కార్యాలయాలకు రప్పించండం విమర్శలకు తావిచ్చింది. ఇదే సమయంలో 33 మంది పెన్షనర్లు ఎండ తీవ్రత తట్టుకోలేక మరణించారని విపక్షాలు విరుచుకుపడ్డాయి.

అదేవిధంగా ఈ ఘటనపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడమే కాకుండా, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం జవహర్ రెడ్డి అధికార పార్టీకి సహకరిస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు జోరందుకొన్నాయి. ఈయన స్థానంలో 1981 బ్యాచ్‌కు చెందిన ఆర్‌పీ సిసోడియాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈయనకు ఇంకా రెండేళ్ళ సర్వీస్ ఉండటంతో అధికారులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది.

గతంలో వేటు వేసిన జగన్.. రివెంజ్ ఉంటుందా?

గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తర్వాత చాలాకాలం పోస్టింగ్‌ కోసం ఎదురుచూశారు ఆర్‌పీ సిసోడియా. తర్వాత ఈయ‌న‌ను ఏమాత్రం ప్రాధాన్యం లేద‌ని ఐఏఎస్‌లు భావించే ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియ‌మించింది. కొన్నాళ్ల కింద‌ట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణకు అప్ప‌టి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేలా అపాయింట్‌మెంట్ ఇప్పించింది సిసోడియానే అనే వాదన ఉంది. ఆయన కార‌ణంగానే సూర్య‌నారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌గ‌లిగార‌ని.. వారి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని జగన్ సర్కార్ భావించి బదిలీ వేటు వేసిందనే చర్చ ఉంది. సూర్యనారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్ ఇప్పించారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని ఐఏఎస్ వర్గాల్లో తెగ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ సిసోడియా సీఎస్ అయితే, జగన్ సర్కార్ కు చుక్కలు కనపడడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment