వైసీపీ(YCP)కి మంత్రులు, ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పడంపై టీడీపీ(TDP) సీనియర్ నేత బుద్దా వెంకన్న(Budha Venkanna) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బి.ఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని అన్నారు. టీడీపీ, జనసేన బి ఫామ్ వచ్చిన వాళ్లే ఎమ్మెల్యేలు అవుతారని జోస్యం చెప్పారు.
ఎలాగూ ఓడిపోతారని తెలిసి సీఎం నిర్ణయాన్ని కార్యకర్తలు అంగీకర్తిస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 జగన్మోహన్ రెడ్డి విధ్వంస నామ సంవత్సరంగా నామకరణం చేశారని, 2024లో చంద్రబాబు సీఎం అవ్వడం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినట్లేనని వ్యాఖ్యానించారు.
1932లో జనవరి 4న గాంధీ అరెస్ట్ ఎలా గుర్తుందో.. అలాగే 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో ప్రజలకు గుర్తు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ ఈ రోజు జగన్ ముందు ఎలా ఉన్నారో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా వుందో స్పష్టమవుతోందన్నారు. మైకులు లేకుండా బొత్సతో మాట్లాడితే అసలు నిజాలు చెబుతారని బుద్దా వెంకన్న అన్నారు.
మరోవైపు, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని అన్నారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వక సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల భూములు, ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.