ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు(AP 10th Results) విడుదలయ్యాయి. విజయవాడ(Vijayawada)లో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది దాదాపు 7లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.16లక్షల మంది పరీక్షలు రాశారు. వీరిలో 86.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.34లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
అందులో బాలికలు అత్యధికంగా 89.17 శాతం.. బాలురు 84.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,003 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఒక్కరు కూడా పాస్ కాని స్కూళ్లు 17 ఉన్నాయి. ఈ సందర్భంగా చినట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు.
విద్యాసంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.7శాతంతో స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది. చివరి స్థానంలో కర్నూల్ జిల్లా విద్యార్థులు 67శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పరీక్షల్లో ఒక్కరూ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.
ఉపాధ్యాయులు తమ విధులను సరైన విధంగా నిర్వర్తించారని ఎవరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని చెప్పారు. తొలిసారి లాస్ట్ వర్కింగ్ డేకు ముందే ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని నెల రోజులు సమయం ఉన్నందున బాగా చదువుకుని సప్లిమెంటరీ పరీక్ష రాయాలని సూచించారు. గత మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు.