తెలంగాణ (Telangana) పగ్గాలను చేజిక్కించుకొన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పదవులపై రుసరుసలు ఉన్నా.. బయట పడకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అదీగాక త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ తేవడానికి ముందుగానే పదవుల పంపిణీ చేయాలనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad)కి తొలి ప్రాధాన్యం దక్కనున్నట్టు ప్రచారం.. అదీగాక ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించి అసంతృప్తితో ఉన్న నేతలను సంతోషపెట్టడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ముందడుగు వేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది..
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కి, నగరంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.. బరిలో ఉన్న అభ్యర్థులు సైతం ఓటమి రుచి చూశారు. అయినప్పటికీ నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్, మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. మరోవైపు నిజామాబాద్‌లో ఓటమి చెందిన షబ్బీర్ అలీ
(Shabbir Ali)కి మంత్రి పదవి ఓకే అయితే, ఫిరోజ్ఖాన్కు అవకాశాలు ఉండవని తెలుస్తోంది.
ఇక మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ నుంచి గడ్డం సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి చెందిన మధుయాస్కీ(ఎల్బీనగర్), అంజన్‌కుమార్ యాదవ్(ముషీరాబాద్) పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) మంత్రి పదవుల రేసులో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా? అనేది సీక్రెట్ గా ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కోసం హైదరాబాద్‌కు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ అగ్రనేతలని ప్రసన్నం చేసుకొనే పనిలో పడినట్టు గుసగుసలు వినిపిస్తోన్నాయి..