తెలంగాణ (Telangana) ఎన్నికల నేపథ్యంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ (Congress)తో కలిసి బరిలో దిగేందుకు సిద్ధమైన కామ్రేడ్స్ చివరి నిమిషయంలో కీలక నిర్ణయం తీసుకొని ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ నేతల తీరుతో విసిగిన కామ్రేడ్లు.. ఒంటిరిగా బరిలో దిగుతామని ప్రకటించడం.. మొదటి లిస్ట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం (CPM)..తాజాగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్ నగర్ (Huzur Nagar)నుంచి మల్లు లక్ష్మి, నల్లగొండ (Nalgonda) నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని తెలిపింది. కోదాడ అభ్యర్థిని రేపు ప్రకటిస్తామని.. మరోవైపు ఇల్లందు, మునుగోడులో కూడా పోటీ చేయాలని చూస్తున్నట్టు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) తెలిపారు.
ఇప్పటికే కాంగ్రెస్ పై పీకల దాకా కోపంగా ఉన్న సీపీఎం.. మునుగోడులో సీపీఐ (CPI) పార్టీ పోటీ చేస్తే మద్దతు ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్‌కు, వామపక్షాలతో పొత్తుల విషయంలో స్పష్టత లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఫోన్ చేసి ప్రకట ఆపాలని చెప్పడం కరెక్ట్ కాదని హితవు పలికారు. సీపీఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో ఎనిమిది సార్లు గెలిచిన చరిత్ర ఉందని.. అలాంటిది తమకు పొత్తులు పెట్టుకోవాల్సిన ఆలోచన లేదని తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.