తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ శ్రమించాయి. బహిరంగా సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఇలా.. అన్ని దారుల్లో ప్రజలకు చేరువ అయ్యేందుకు నేతలు చేసిన ప్రయత్నాలకు ఫలితాలు 3 తారీఖున తెలువనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కీలక సందేశం ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో ఆరోగ్య కారణాల రీత్యా పాల్గొనలేక పోయినట్టు తెలిపిన సోనియా గాంధీ.. ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఙప్తి చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్న.. కానీ మీరు ఎప్పుడు నా మనస్సుకు దగ్గరగా ఉంటారని తెలిపారు.. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని భావిస్తున్న.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు నెరవేరడం చూడాలని అనుకుంటున్నట్టు సోనియా గాంధీ వెల్లడించారు.
దొరల తెలంగాణగా మారిన రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చి.. మీ కలలు సాకారానికి పునాదులు వేసుకోవాలని ఆశిస్తున్నా.. మీకు మంచి ప్రభుత్వం లభించాలని కోరుకుంటున్నా అని సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. నన్ను సోనియమ్మ అని పిలిచి మీ రాష్ట్రానికి అమ్మను చేశారు. చాలా గౌరవం ఇచ్చారు.. మీ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికి మీకు రుణపడి ఉంటానని సోనియా గాంధీ అన్నారు..
తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం.. మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయండి.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని వీడియో ద్వారా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని సోనియా గాంధీ స్పీచ్ తో ముగించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ పలు కారణాల రీత్యా సోనియా గాంధీ ప్రచారానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో స్టేట్ కాంగ్రెస్ లీడర్స్, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా.. సోనియా గాంధీతో వీడియో ద్వారా సందేశం ఇప్పించారు .