తెలంగాణ9 Telangana)లో శాసనసభ ఎన్నికల (Assembly Elections)కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సింది ఉంది. కాగా 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు తొలిరోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress) బీజేపీ (BJP) అభ్యర్థులు పలుచోట్ల నామినేషన్లు వేశారు. కానీ అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి మాత్రం ఇంకా ఎవరూ నామినేషన్ల ప్రక్రియ మొదలు పెట్టలేదు. మరోవైపు అధికంగా స్వతంత్ర అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు వేసి ఆశ్చర్యపరిచారు. ఇక చిన్న పార్టీలకు చెందిన చోటమోట అభ్యర్థులూ అక్కడక్కడ నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు మొదటి రోజు నామినేషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. అధికార పార్టీ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. ఇక కొడంగల్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున.. ఆయన సోదరుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు హైదరాబాద్ గోశామహల్ అభ్యర్థిగా సునీతారావు కాంగ్రెస్ తరపున అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇలా పలుచోట్ల నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగింది. ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ.. ఇంకా నామినేషన్లు మొదలు పెట్టకుండా బీఆర్ఎస్ మౌనంగా ఎందుకుందో ! అనే ఆసక్తి పలువురిలో కలుగుతుంది.