తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections)దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) దూకుడు ప్రదర్శిస్తూ సభల మీద సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ (Congress) మాత్రం రెండో జాబితా పై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. పది రోజుల క్రితమే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ ఇంకా రెండో జాబితా విడుదల పై సస్పెన్షన్ కొనసాగిస్తుంది.
వామపక్ష పార్టీలతో పొత్తులో భాగంగా సీపీఐ (CPI) సీపీఎం (CPM)లకు ఇచ్చిన నాలుగు స్థానాలను మినహాయించి మరో 60 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఈసీ సభ్యులు తదితరులు సమావేశం నిర్వహించారు..
ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు సమాచారం.. అయితే ఈ సమావేశంలో 40-45 స్థానాలపై ఏకాభిప్రాయం కుదరగా.. 15-20 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.
ఇదే బాటలో మరికొంతమంది సీనియర్ నేతలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జాబితా విడుదలలో జాప్యం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వామపక్షాలకు ఇచ్చే సీట్లపై అనిశ్చితి కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సమస్యగా మారి ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలలో చర్చించుకొంటున్నారు..