తుమ్మల నాగేశ్వరావు (Thummala Nageswara Rao)కు బీఆర్ఎస్ (BRS) టిక్కెట్ దక్కకపోయిన నాటి నుంచి ఖమ్మం (Khammam) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తూ…రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తుమ్మల ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఎక్కడ చూసిన చర్చ నడుస్తోంది.
ఈ నేపధ్యంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మలతో భేటి అయిన సీఎల్పీ నేత భట్టి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భట్టి రాకతో ఇటు భట్టీ అభిమానులు, అటు తుమ్మల అనుచులు కూడా తుమ్మల ఇంటికి భారీగా చేరుకున్నారు. ఇంతకు ముందే తుమ్మలను రేవంత్‌రెడ్డి, పొంగులేటి కూడా కలిశారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి మరింత జోష్ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత మరొకరు తుమ్మలను కలిసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ తుమ్మల మాత్రం ఇప్పటి వరకు తాను పార్టీ మారుతున్నట్లు కానీ, తన భవిష్యత్తు కార్యచరణ కానీ ప్రకటించలలేదు. దీంతో తుమ్మల అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడు ఖమ్మం రాజకీయాలు డిబేటబుల్ పాయింట్ గా మారింది.
గతంలో రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా తుమ్మలను కలవడంతో…తుమ్మల హస్తం గూటికి వస్తారనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భట్టి విక్రమార్కకు ఖమ్మంలో భారీగా కార్యకర్తల సపోర్ట్ ఉంది. అందువల్ల భట్టి లాంటి వారు అడిగాక…తుమ్మల హస్తం గూటికి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మాజీ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర రావుకి BRS పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో… తుమ్మల రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో ఏదో ఒక పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం తుమ్మల కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తుమ్మల సన్నిహితులు నుంచి వస్తున్న సమాచారం.
తుమ్మలను పాలేరు లేదా ఖమ్మం నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి కాంగ్రెస్ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. తుమ్మల మాత్రం కచ్చితంగా వస్తానని హామీ ఇవ్వట్లేదు. తన ప్రజలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు. ఈ వారంలో ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు, ఇతర బీఆర్ఎస్ అసంతృప్తులందరిని కలుపుకుని, కాంగ్రెస్ తన బలం మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే వరుసగా కాంగ్రెస్ నేతలు తుమ్మల ఇంటికి వస్తూ, పోతూ ఉన్నారు.
వచ్చే వారం తుమ్మల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వినిపిస్తున్న తరుణంలో అదే నిజమైతే ఖమ్మంలో బీఆర్ఎస్ గట్టి పోటీనే ఎదుర్కొవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.