షహీద్ శివ దేవీ తోమర్ (Shaheed Shiv Devi Tomar)….బ్రిటీష్ దురాగతాలకు ఎదురు తిరిగిన వీర బాలిక. బ్రిటీష్ సైన్యంపై కత్తి దూసిన సివంగి. 16 ఏండ్ల వయసులోనే బ్రిటీష్ సేనల (British Army)ను ఊచకోత కోసిన వీర బాలిక. ఒంటి నిండ గాయాలతో రక్తం చిందుతున్నా బ్రిటీష్ దళాలపై విరుచుకు పడిన పోరాట యోధురాలు.
10 మే 1857న సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు యూపీలోని బిజ్రౌల్ నివాసి బాబా షహ్మల్ సింగ్ తోమర్ బరౌత్ తహసీల్‌ను ఆక్రమించాడు. బరౌత్ స్వాతంత్య్రానికి గుర్తుగా అక్కడ జెండా ఎగుర వేశాడు. అక్కడ ప్రభుత్వ ఖజానాను దోచుకుని ఆ ధనాన్ని ఢిల్లీ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు బాబా షహ్మల్ సింగ్ పంపించాడు.
విషయం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు 18 జూలై 1857 న బాబా షహ్మల్ సింగ్‌ను కాల్చి వేశారు. ఆయనకు సహకరించిన వాళ్ల ఇండ్లను కూల్చి వేసి, 32 మంది జాట్ తిరుగుబాటుదారులను చెట్టుకు ఉరి తీసి చంపారు. ఈ ఘటనను కండ్లారా చూసిన పదహారేండ్ల శివ దేవీ తోమర్ రక్తం మరిగి పోయింది. బ్రిటీష్ సేనలపై దూకి తన కత్తితో 17 మంది బ్రిటీష్ సైనికులను ఊచకోత కోసింది.
ఈ పరిణామంతో భయాందోళనకు గురైన బ్రిటీష్ సైనికులు కొంత మంది పారిపోయారు. ఈ క్రమంలో తన గాయాలకు కట్టు కడుతుండగా బ్రిటీష్ సేనలు ఆమె పైకి మరోసారి దూసుకు వచ్చాయి. ఓ వైపు రక్తం ధారగా కారుతున్నా బ్రిటీష్ సేనలతో పోరాడింది. చివరకు వీర మరణం పొందింది. 16 ఏండ్ల బాలిక చూపిన సాహనం ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది.