Rahul : ఢిల్లీలో నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును మార్చడంపై కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవల వల్లే ఆయన దేశ ప్రజల ఆరాధ్యుడయ్యారని అంతే తప్ప తన పేరు వల్ల కాదని ఆయన అన్నారు. భారత 77 వ స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఈ మ్యూజియం పేరును ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ’ గా ప్రభుత్వం మార్చింది. . అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దీని పేరును ఎందుకు మార్చవలసి వచ్చిందని విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. నెహ్రూవియన్ లెగెసీని ప్రధాని మోడీ వక్రీకరిస్తున్నారని, మచ్చ తెస్తున్నారని ఈ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ ఈ పేరులో ‘ఎన్’ పదాన్ని తొలగించి ‘పి’ అనే అక్షరాన్ని జోడించారని, ఇది ‘పెట్టినెస్’ కి, ‘పీవ్’ కి ప్రతీకగా మారిందని జైరాంరమేష్ పేర్కొన్నారు.
అంటే సంకుచిత రాజకీయాలే ఇందులో కనిపిస్తున్నాయన్నారు. ఈ మ్యూజియం పేరును మారుస్తున్నట్టు ఈ సంస్ధ ఎగ్జిక్యూటివ్ ఏ. సూర్యప్రకాష్..వివరిస్తూ.. సమాజ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. ఈ సొసైటీ గత జూన్ మధ్యలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే పేరును మార్చాలన్న ప్రతిపాదన వచ్చిందని ఆయన గుర్తు చేశారు
. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రులంతా చేసిన సేవలను ప్రస్తుతిస్తున్నట్టుగా కొత్త భవనం పేరును మార్చినట్టు ఆయన వివరించారు. ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు.పేరు మార్పుపై అనవసర వివాదం తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు.