అయోధ్యలో ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట (Consecration)కు సమయం దగ్గర పడుతోంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరుకానున్నారు. జనవరి 23 నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు సాదరంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రెడీ అయింది. ముఖ్యంగా శ్రీరామ మందిరాన్ని తలిపించేలా నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు టెర్మినల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
అయోధ్య నగరానికి 15 కిలీమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయాన్ని ఆధ్యాత్మికత, అధునాత సౌకర్యాల మేళవింపుగా నిర్మించారు. ముఖ్యంగా ఆలయాన్ని నిర్మించినట్టుగానే విమానాశ్రయాన్ని కూడా నగర శైలిలో నిర్మించారు. ఎయిర్ పోర్టు ముఖద్వారాన్ని రామ మందిరాన్ని పోలి ఉండేలా నిర్మించారు. దీంతో ఎయిర్ పోర్టు టెర్మినల్‌లో ఎంట్రెన్స్‌లోనే ఆద్యాత్మిక భావన మొదలవుతుంది. దీంతో రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అనే కుతూహలం కలుగుతుంది.
అయోధ్య ఎయిర్ పోర్టు టెర్మినల్‌లోకి అడుగు పెట్టగానే శ్రీ రాముని జీవిత విశేషాలను కండ్లకు కట్టినట్టు చూపించేలా ప్రత్యేక కళాఖండాలను, కుడ్యు చిత్రాలు, స్థానిక పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లిపోతారు. ఈ టెర్మినల్ భవనం మనకు గొప్ప సందేశాలను ఇస్తుందని స్తపతి చీఫ్ ఆర్కిటెక్ట్ హర్ష వర్షనేయ వెల్లడించారు.
విమానాశ్రం టెర్మినల్ భవనంపై విల్లు, బాణాలు ఉంటాయని తెలిపారు. ఇది అసత్యాన్ని ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీక అని ఆయన చెప్పారు. షట్కోణ కాంతి కణాలు అధికార క్రమానుగత శ్రేణిపై శాశ్వతమైన విజయాన్ని సూచిస్తాయన్నారు. ఇది ఇలా వుంటే ఈ టెర్మినల్ ను 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో రూ. 1450 కోట్లతో మొదటి ఫేజ్ పూర్తి చేశారు.
మొదటి ఫేజ్‌లో భాగంగా ఏటా 10 లక్షల మందికి సేవలు అందించేలా టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. రెండవ ఫేజ్ పూర్తయితే ఏటా 60లక్షల మందికి ఎయిర్ పోర్టు సేవలు అందించగలదు. ఇందులో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు, సోలార్ పవర్ ప్లాంట్, మురుగునీటి శుద్ది వంటి ఏర్పాట్లను చేశారు.