కోట్లాది హిందువుల కల అయోధ్య రామమందిరం నిర్మాణం.. ఈ ఆశ నెరవేరింది. కానీ నిర్మాణం (Construction) ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మందిరం నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం..

అలాగే డిసెంబరు (December) నాటికి ఆలయ పనులను పూర్తి చేస్తామని అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. మరోవైపు మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 1200 మంది కార్మికులను మిగతా మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు నియమించారు. ఇక ఆలయ భద్రత కోసం 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మిస్తున్నారు.
ఆదేవిధంగా ప్రదక్షిణ మార్గం, మరో ఆరు దేవతలకు ఆలయాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులను ఇంతకుముందు వరకు 2000 మంది కూలీలు చేసేవారు. త్వరలోనే వీరి సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు. ఇదిలా ఉండగా వివిధ దేవతలకు చెందిన మొత్తం ఎనిమిది ఆలయాలను రామజన్మభూమి కాంప్లెక్స్‌లో నిర్మించనున్నారు. వీటన్నింటి నిర్మాణం పూర్తి కావడానికి మరో 18 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.