అయోధ్య(Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రామ మందిర(Ram Mandir) ప్రారంభోత్సవానికి కొద్ది గంటలే మిగిలుంది. సోమవారం నిర్వహించే ఈ మహా ఘట్టానికి దేశ, విదేశాల నుంచి అతిథులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు. వీధుల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు చేయొద్దని, ప్రదర్శనలు చేపట్టొద్దని గౌతమ్ బుద్దనగర్ పోలీసులు తెలిపారు.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత 25వ తేదీన హజ్రత్ అలీ జయంతి వేడుకలు జరుగుతాయి. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోవ్సవ వేడుకలు నిర్వహిస్తారు. మరోవైపు, 22న కొన్ని రాష్ర్టాలు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30వరకు సెలవిచ్చాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ పాఠశాలలకు సెలవు ఇచ్చాయి. రిలయన్స్ తమ సంస్థల ఉద్యోగులకు సోమవారం సెలవు ప్రకటించింది.
యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా గుజరాత్, అస్సాం, రాజస్థాన్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఒంటిపూట సెలవు ఇచ్చారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు. దానికి బదులుగా సెలవుదినమైన శనివారం స్టాక్‌మార్కెట్లు పనిచేశాయి.