అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. సుమారు 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ జర్నీ ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన సికింద్రబాద్కు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
అయోధ్యలోని బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.. భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా జనవరి 22 వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టానికి వీక్షించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు వేయికళ్లతో ఎదురు చూశారు. 500 ఏళ్ల నాటి కల సాకారం అయిన సందర్భంలో హిందువులు ఈ వేడుకను తమ ఇంటి వేడుకగా భావించి ఆనందంగా జరుపుకొన్నారు.
ఇప్పటికే బాలరాముడిని దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్యకు, పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అయోధ్యను చూసేందుకు దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రానున్న కాలంలో అయోధ్య మరింత బిజీగా మారే అవకాశం ఉండటంతో దృష్టి సారించిన రైల్వే అధికారులు మొట్ట మొదటగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు రైల్ ను ప్రారంభించారు. రానున్న రోజులో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు..
మరోవైపు అయోధ్యప్రారంభోత్సవం నేపథ్యంలో కొంతకాలం పాటు నిర్మాణ పనులు నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయోధ్యలో మిగతా ఆలయ నిర్మాణ పనులు పున:ప్రారంభించారు. గుడి మొదటి అంతస్తులో నిర్మించబోయే రాముడి దర్బార్ తో పాటు రెండో అంతస్తు పనులు కూడా మొదలు కానున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణ పనులు కంప్లీట్ అవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు వెల్లడించారు.