అయోధ్య (Ayodhya)లో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను నిన్న ఎంతో ఘనంగా నిర్వహించారు.. ప్రపంచ దేశాలు సైతం రామా అనేలా జరిగిన ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.. ఇక కృష్ణశిల (Krishnasila)పై చెక్కిన రాముడి విగ్రహం ( Rama Statue) ముగ్ధ మనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సోమవారం సాకారం అయ్యింది. ఎన్నో దశాబ్దాలు పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల నిజం అయ్యింది. ఈ అద్భుత క్షణాల కోసం రామ భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూశారు.
మరోవైపు కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారంలో రాములోరీ వేడుకను వీక్షించారు. ఇక ఎన్ని జన్మల పుణ్యఫలమో బాల రామయ్యను అందంగా మలిచే అవకాశం కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కి దక్కింది. అయితే ఈ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది.
గుర్తుతెలియని వ్యక్తులు బాల రాముడి విగ్రహానికి కదలికలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో జోడించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో బాల రాముడి విగ్రహం కళ్లు ఆర్పుతూ, అటూఇటు చూస్తూ, చిరునవ్వులు రువ్వడం కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై రామ భక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తిని మెచ్చుకొంటూ కామెంట్లు చేస్తున్నారు.