అయోధ్య (Ayodhya)లో నెలరోజుల క్రితం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపనతో 500 ఏళ్ల రామభక్తుల కల నెరవేరింది. ఆ తర్వాత రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతించింది.. అయితే ఆ సుందర రూపుడు.. దశరథుని తనయుడు అయిన రాఘవుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ప్రస్తుతం తండోపతండాలుగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు.
ఇప్పటి వరకు సుమారుగా 60 లక్షల మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకొన్నారని శ్రీరామజన్మభూమి (Sri Ramajanmabhoomi) తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ (Tirth Kshetra Trust) వెల్లడించింది. ఇలా భక్తుల ప్రవాహం ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. కౌసల్య తనయుని దర్శనానికి రాజకీయ నాయకులు, నటీనటులు సైతం క్యూ కడుతున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ట్రస్ట్తోపాటు అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక రామయ్య (Ramaiah) దర్శనానికి గంట నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతోందని సమాచారం. అయితే శ్రీరాముడిని దర్శించుకొని పరవశించి పోతున్న భక్తులు.. రాముడి ముందు ఎక్కువ సమయం కూర్చోవాలని.. గుడి లోపల మరికొన్ని నిమిషాలు గడపాలని అనిపించినట్లు పేర్కొంటున్నారు. రామయ్య రూపాన్ని మదిలో ఊహించుకొంటూ రామనగరి నుంచి ఇంటిబాట పడుతున్నారు..
మరోవైపు బాల రామయ్యను దర్శించుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాలను నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజూ అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి. సూర్యోదయం అవ్వగానే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రాముడికి దర్శనానికి వెళ్తూ కనిపిస్తున్న దృశ్యాలు రామరాజ్యాన్ని తలపిస్తోందని అంటున్నారు..
అదీగాక అయోధ్య ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో నగరంలో ఎలాంటి ట్రాఫిక్ తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal), తమ కుటుంబసభ్యులతో పంజాబ్ సీఎం భగవత్ మాన్, రాష్ట్ర అసెంబ్లీ సభ్యులతో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మొదలగు వీరంతా రామయ్యను దర్శించుకొన్నారు.