Azad: దేశం లోని ముస్లింలలో చాలామంది హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించిన వారేనని డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇందుకు కశ్మీర్ లోయలోని కశ్మీరీ పండిట్లే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం దోడాజిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన… ఈ పండిట్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతం లోకి మారిపోయారని పేర్కొన్నారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీర్ లో ఒక్క ముస్లిం కూడా లేరు.. వీరిలో చాలామంది ఆ తరువాత ముస్లిములుగా మారిపోయారని అన్నారు. .. భారత్ లో పుట్టిన వారంతా మొదట హిందువులే నన్నారు. .ఇస్లాం ఈ దేశానికి కొన్నేళ్ల క్రితమే వచ్చిందని, కానీ హిందూ మతం చాలా పురాతనమైనదని చెప్పారు. .
రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వినియోగించుకోరాదని, దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేవారంతా బలహీనులే నన్నారు. భారత దేశంలోని ముస్లిములంతా బయట నుంచి వచ్చిన వారేనని అంటారని, కానీ ఇక్కడ ఎవరూ బయటి నుంచి వచ్చిన వారు లేరని పేర్కొన్నారు. 1500 ఏళ్ళ క్రితమే ఇస్లాం మతం ఉందని, కానీ హిందూ మతం మాత్రం చాలా పురాతనమైనదన్నారు. దేశంలో బయటి నుంచి వచ్చిన ముస్లిములు 10 నుంచి 20 శాతం ఉంటారని. వారిలో కొందరు మొఘల్ సైన్యంలో పని చేశారని కాంగ్రెస్ మాజీ నేత కూడా అయిన ఆజాద్ చెప్పారు.
ఇతర ముస్లిములంతా హిందూయిజం నుంచి మారినవారే .. అందుకు కశ్మీరీ పండిట్లేఉదాహరణ అన్నారు. అంతా ఇక్కడ పుట్టినవారేనని వ్యాఖ్యానించారు. హిందువులు మరణించినప్పుడు మృతదేహాలను దహనం చేస్తారు.. వేర్వేరు చోట్ల ఇలా జరుగుతుంది.. వారి బూడిదను నదిలో కలిపేస్తారు.. మనం ఆ నీటిని తాగుతున్నాం .. ఆ నీటిలో బూడిద ఉందని ఎవరు చూస్తారు .. ప్రజలు ఆ నీటినే తాగుతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆజాద్.
అలాగే ముస్లిముల మృతదేహాల ఎముకలు ఈ దేశ గడ్డలో భాగమవుతాయని, చెప్పిన ఆయన.. ఈ భూమిలో హిందువులు, ముస్లిములు కలిసిపోయారని, వీరి మధ్య భేదం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాల్లో మతాన్ని అడ్డు పెట్టుకుని ఓటు బ్యాంక్ కోసం తహతహలాడరాదన్నారు. ఆజాద్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపవచ్చునని భావిస్తున్నారు.