Baghel : చంద్రయాన్-3 మిషన్ ఘనత అంతా దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకే చెందుతుందని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ అన్నారు. నాడు నెహ్రూ చాలా ముందు చూపుతో వ్యవహరించారని, అంతరిక్ష పరిశోధనలకోసం 1962 లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను స్థాపించారని ఆయన చెప్పారు అదే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) గా మారిందన్నారు. ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలకృషితో బాటు ఈ మిషన్ విషయంలో నాటి తొలి ప్రధాని నెహ్రూ పాత్ర కూడా ఉందన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం మన శాస్త్రజ్ఞుల అమోఘమైన కృషికి నిదర్శనమని, వారిని మనఃస్ఫూర్థిగా అభినందిస్తున్నానని బాఘేల్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత నలిన్ కోహ్లీ స్పందిస్తూ ఈ మిషన్ కి క్రెడిట్ ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కే ఆపాదిస్తే అది గతంలోని పోకడలో వారు చిక్కుకున్నట్టేనన్నారు. ఆ పార్టీకి ప్రస్తుత లేదా భవిష్యత్తు గురించి ఏమీ తెలియదన్నారు
. చంద్రయాన్-3 కి క్రెడిట్ ని మనం ఇస్రో సైంటిస్టులకు, ఇస్రోకు, ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మరో నేత అమిత్ మాలవీయ.. ప్రధాని మోడీ నాయకత్వం కింద ఇండియా ఎంతో ఘనత సాధించిందని, ఇది నాడు నెహ్రూ, మన్మోహన్ సింగ్ ల హయాంలో కన్నా చాలా హెచ్చు స్థాయి అని వ్యాఖ్యానించారు.
గత తొమ్మిదేళ్లలో మన దేశం అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయాలు చవి చూసిందన్నారు. ఇక సక్సెస్ అన్నది ఏ రాజకీయ పార్టీది కాదని, చంద్రయాన్-3 మిషన్ మొత్తం దేశానికే గర్వకారణమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇస్రో టీమ్ అంతా ఇండియాదే .. వారి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైంది గానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ వల్లో కాదని ఆమె వ్యాఖ్యానించారు.