మహిళా బిల్లుపై పోరాటం అంటున్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha).. బీఆర్ఎస్ లో మహిళలకు ఎక్కువ టికెట్లు ఎందుకు ఇప్పించలేకపోయారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) తీరును తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్లు.. తన వ్యక్తిగత అజెండా కాదని.. ఈ బిల్లు కోసం డిసెంబర్ లో మళ్లీ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.
2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు 13ఏళ్లైనా ఎందుకు ఆమోదం పొందలేదని అడిగారు కవిత. ఈ అంశంపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్రభుత్వాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. మహిళల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలకు హక్కులు కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ఆరోపించారు. అందుకే, పార్లమెంటులో మహిళా ఎంపీలు 12 శాతమే ఉన్నారని పేర్కొన్నారు.
దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు కవిత. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ కూడా కొట్లాడారని గుర్తుచేశారు. తొలి లోక్ సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్ లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు.
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు కవిత. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఆ నేతలు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా అని అడిగారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటనపై కవిత స్పందించారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే అంశంగా పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే బాధ్యులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల విషయంలో ఎలా ముందుకెళ్లాలనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు కవిత.