Telugu News » వానొస్తే.. నగరవాసులకు నరకం.. ప్రభుత్వ పాపమేనా?

వానొస్తే.. నగరవాసులకు నరకం.. ప్రభుత్వ పాపమేనా?

by admin
Heavy Rain Effect in hyderabad 1

చినుకు పడితే హైదరాబాద్ వాసుల గుండెల్లో వణుకు మొదలవుతుంది. రోడ్లపైకి నీరు చేరి ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని బిక్కుబిక్కుమంటూ వాహనాన్ని ముందుకు నడిపించాల్సి వస్తోంది.
ఈ పాపం ఎవరిది?
ఏళ్లు గడుస్తున్నా మార్పు ఏది?
ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రతిపక్షాల వాదనేంటి..?

Heavy Rain Effect in hyderabad

హైదరాబాద్ మహానగరం.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతం. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో చాలా భాగం నగరంలో కలిసిపోయింది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు అపార్ట్ మెంట్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు సక్రమంగా.. లేదంటే అక్రమంగా ప్లాట్స్ చేసేస్తున్నారు. భవనాలు లేపేస్తున్నారు. దీని ఫలితంగా నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి. ఇంకేముంది, వాన పడితే వరద నీరు ఎటు పోవాలో దారి లేక ఇళ్లలోకి కొత్త దారులు వెతుక్కుంటోంది.

వరదలొచ్చినప్పుడల్లా నాలాల అభివృద్ధి, కబ్జాలపై కొరడా అనే వార్తలు ప్రభుత్వం సైడ్ నుంచి వినిపిస్తున్నా.. కార్యాచరణ అమలులో మాత్రం జాప్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. పైగా బీఆర్ఎస్ నేతలే విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌ ను డల్లాస్‌, ఓల్డ్‌ సిటీని ఇస్తాంబుల్‌ చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం.. నగరాన్ని నరక కూపంగా మార్చిందని విమర్శిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టానుసారం భూములు, చెరువులను కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్ 9ఏళ్ల పాలనలో నగరంలో సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టలేదనేది ప్రతిపక్ష నేతల వాదన. కానీ, ప్రభుత్వం ప్రచారం మాత్రం పీక్స్ లో చేసుకుంటోందని.. నిజంగా ఈ అంశంలో అంత అభివృద్ధి జరిగితే.. ఐటీ కారిడార్‌ నుంచి హయత్‌ నగర్‌ దాకా ట్రాఫిక్‌ జామ్స్ ఎందుకవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని.. కేవలం 10 నిమిషాల ప్రయాణానికి 2 గంటల సమయం పడుతోందని ఫైరవుతున్నారు. స్ర్టాటజిక్‌ రోడ్లు అంటూ హడావుడి చేసినదంతా డొల్లేనని తేలిపోయిందని విమర్శిస్తున్నారు.

మరోవైపు, నగరంలో అభివృద్ధిని ఓవైపుకే పరిమితం చేయడం కూడా నగరవాసుల ట్రాఫిక్ నరకానికి కారణంగా చెబుతున్నారు విపక్ష నేతలు. నలుదిక్కులా అభివృద్ధి జరిగి ఉంటే జనానికి ఇన్ని బాధలు తప్పేవని చెబుతున్నారు. పైగా, పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ముమ్మాటికీ గులాబీ సర్కార్ ఫెయిల్ అయిందని చెబుతున్నారు.

You may also like

Leave a Comment