పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం ఉన్న విషయం తెలిసిందే.. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీలు.. విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.. ఈ క్రమంలో కరీంనగర్ బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్.. రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారమని ధ్వజమెత్తారు.. ఈ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కరీంనగర్ (Karimnagar) జిల్లా, హుజూరాబాద్ (Huzurabad)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలను వంచించి కేసీఆర్ (KCR) కుటుంబం వేల కోట్లు సంపాదించిందని విమర్శలు గుప్పించారు.. అధికారంలోకి రాక ముందు రబ్బర్ చెప్పులు ముడుతల చొక్కాతో ఉన్న కేటీఆర్ (KTR)కి ఇన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
అధికారాం సొంతం చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడారో.. అది కాపాడు కోవడానికి ఎన్ని మోసాలు చేశారో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని పేర్కొన్నారు.. అసలు మొదట రాజ్యాంగం మార్చాలి అన్నది కేసీఆర్ అని ఆరోపించిన బండి సంజయ్.. రిజర్వేషన్లను తగ్గించమని తెలిపారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయమన్నారు. అసత్యాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు..
మరోవైపు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కై ఉమ్మడి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డ బండి సంజయ్.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.. అలాగే తనను ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.. బీఆర్ఎస్ హయాంలో భారీ ఆర్థిక విధ్వంసాన్ని చూశామని.. ఇక కాంగ్రెస్ గురించి అందరికీ తెలిసిందే వెల్లడించారు..