బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ(Sirisilla textile industry) సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని.. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు. చేనేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు రూ. 270 కోట్లు ఇంతవరకు చెల్లించలేదన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని ఈ మేరకు ఆయన లేఖలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను,
యజమానులపై ఒత్తిడి చేసి.. పాత వ్యాపారాలను బంద్ చేయించిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ తర్వాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిందని విమర్శించారు.
బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుంచి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని బండి సంజయ్ తెలిపారు. మరోవైపు వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక.. కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని అన్నారు. దీంతో పరిశ్రమతోపాటు అనుబంధంగా ఉన్న వార్ఫిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని.. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న సుమారు 20 వేల మంది పవర్ లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని లేఖలో తెలిపారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని.. కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలన్నారు. గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారనీ.. ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.