తెలంగాణ రాజకీయాల్లో నేతల మాటలు చిత్ర విచిత్రంగా మలుపులు తీసుకొంటున్నాయి. బీఆర్ఎస్ ఓటమి చెందిన తర్వాత.. తాడు బొంగరం లేని విధంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు అవాక్కులు చవాక్కులు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay).. హరీష్ రావు (Harish Rao)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) అవినీతిని వ్యతిరేకించి.. బీఆర్ఎస్ (BRS) నుంచి బయటికి వస్తే హరీష్ ను బీజేపీలోకి తీసుకుంటామని బాంబ్ పేల్చారు.. ఈ సందర్భంగా బీజేపీ సిద్దాంతాలు నమ్మి, ప్రధాని మోడీ నాయకత్వంలో పని చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా బీజేపీలో చేరవచ్చని ఆహ్వానించారు. నేడు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన బండి సంజయ్.. కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ పని ఖతం అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని.. అందుకే ఇన్ని స్కామ్‌లు బయటపడుతున్న కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిందని.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి ఉంటే.. ఇప్పటికే, కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉండేవాళ్లని బండి కీలక వ్యాఖ్యలు చేశారు.
మోసపూరిత విధానాలను అవలంభించే కాంగ్రెస్.. కర్ణాటకతో పాటు తెలంగాణ (Telangana)ను సైతం గ్యారంటీల పేరుతో చీటింగ్ చేస్తోందని విమర్శించారు. చివరికి తెలంగాణలో 17 సీట్లు గెలుస్తాం అనే ధీమాతో, కేఏ పాల్ కూడా ఉన్నారని.. ఈ క్రమంలో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలని సెటైర్ వేశారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి సంజయ్ హెచ్చరించారు.