తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బీజేపీ (BJP) ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ అంటేనే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడే బండి.. అందులో కాంగ్రెస్ పై సైతం విమర్శలు గుప్పించిన బండి.. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం.. కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తోన్నట్టు లేఖలో పేర్కొనడం కాంగ్రెస్ పాలనకి కితాబ్ ఇచ్చినట్టని అనుకొంటున్నారు.
ఇకపోతే బండి సంజయ్.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖను గమనిస్తే.. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్ (Bandi Sanjay). ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని పేర్కొన్నారు.
ఇండస్ట్రీయల్ కారిడార్ ను నీలోజిపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం వరకు ఏర్పాటు చేయాలని తెలిపిన బండి సంజయ్.. స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీ ఏర్పాటుని సైతం పరిశీలించాలని లేఖలో తెలిపారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన అవినీతి పరులని విడిచి పెట్టద్దని లేఖలో పేర్కొన్న బండి సంజయ్.. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించాలని సూచించారు.