తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల రోజుల అవుతోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకొచ్చిన హస్తం, డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి (Revanth Reddy) నెలరోజుల పాలనపై ఎక్స్ (X) వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. అయితే ఎప్పుడు ఫైర్ లో ఉండే బండ్ల గణేష్ సైతం తాజాగా కాంగ్రెస్ నెలరోజుల పాలనపై వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ (Bandla Ganesh).. రేవంత్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ అమలు చేసి చూపిస్తోందని కొనియాడారు. రాజకీయం చేయకుండా ప్రజా పాలన చేస్తోందని ప్రశంసించారు.
ఎలాంటి భేషజాలకు పోకుండా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని, కేంద్రమంత్రులను కలువడం అభినందనీయమని పేర్కొన్నారు.. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజల కోసం రేవంత్ రెడ్డి రోజు 20 గంటలు కష్టపడుతున్నారని ప్రశంసించారు.
ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి దేశమంతా మాట్లాడుకుంటోందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ వీర అభిమానినని చెప్పుకునే బండ్ల గణేష్.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.. ఆయన చేసే షాకింగ్ కామెంట్స్ వైరల్ అవడం తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు..