కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indias highest civilian award) భారత రత్న (Bharat Ratna ) ప్రకటించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లకు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా శుక్రవారం మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao), మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి అవార్డులు ప్రకటించినట్లైంది.
ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరుకుల కేంద్రం దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో సత్కరిస్తుంటుంది. ఈ పురస్కారాన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇప్పటివరకు 40మందికి పైగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇందులో ఇద్దరు విదేశీయులూ ఉండటం విశేషం.
భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. ఏటా ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. దేశ ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని ఈ పురస్కారానికి సిఫారసు చేసే అధికారం ఉంటుంది. కానీ, దీనికి పరిమితి అంటూ లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు.
1954 నుంచి అంటే 70ఏళ్లలో ఒకేసారి ఐదుగురికి పురస్కారాన్ని అందజేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏడాదికి ముగ్గురిని మాత్రమే అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది ఐదుగురికి భారత రత్న వరించడం విశేషమనే చెప్పాలి. వీరిలో ఎల్కే అద్వానీ మినహా మిగతా నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది.