రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం దొరికిన అధికార పార్టీపై దుమ్మెత్తి పోయడం తరచుగా కనిపిస్తున్న అంశం.. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) నేతలు అయితే ఈ విషయంలో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఊరంతా చూపించినట్లు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ (Congress) నేతలు సైతం బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.. మీరైతే దళితులను దగ్గరికి రానివ్వలేదన్న విషయాన్ని మరిచారా? కొప్పుల ఈశ్వర్ ను పది మందిలో అవమానించడం రాష్ట్రం మొత్తం చూసిందని చురకలు అంటించారు. దేవుని సన్నిధిలో జరిగిన విషయానికి రాజకీయ రంగులు అద్ది.. కులం అనే కుంపటిని పెట్టడం మానుకొండని సూచిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..
యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్‌పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీ ముఖ్య లీడర్లు భట్టిని అవమానించారని కాంగ్రెస్ పై ఫైర్ అవుతూ.. విమర్శలు ఎక్కుపెట్టారు.. అయితే తాజాగా యాదాద్రి వివాదంపై భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని క్లారిటీ ఇచ్చారు.
దేవునిపై భక్తి భావంతోనే అలా చేశానని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించా అని తెలిపారు.. ఆ సంఘటనను చూసిన కొందరు తనకు అవమానం జరిగిందని భావించారని.. తనను ఎవరూ అవమానించలేదని భట్టి విక్రమార్కపేర్కొన్నారు.. ఏదో ఆశించి కొందరు కావాలనే ఆ ఫోటోతో ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.
తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని తెలిపిన భట్టి విక్రమార్క.. మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని అన్నారు. తాను ఎవరికీ తలవంచనని ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చి చెప్పారు.