పదవుల కోసం పాకులాడే పాలకులు.. పూటగడిస్తే చాలు అనుకునే ప్రజలు.. ధర్మాన్ని కూడా ఒక ధరకి అమ్మేస్తూ ఉంటే ఇంకా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తున్న యువకులు.. ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు వాడుతున్న అస్త్రాలు.. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతుంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS)పై కాంగ్రెస్ (Congress) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంపదని దోపిడి చేసి ధనవంతులుగా మారిన అత్యంత అవినీతిపరులు బీఆర్ఎస్ పాలకులు అంటూ మండిపడ్డారు. దొరల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ (Telangana) రాష్ట్రం అభివృద్ధి జరగలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి.. పేదలకు ఇల్లు.. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదని, ఉచితంగా ఇస్తానన్న సబ్సిడీ ఎరువులు ఇవ్వకుండా రైతులను బీఆర్ఎస్ ఆగం చేస్తుందని భట్టి మండిపడ్డారు..
పండిన పంటకు మద్దతు ధర లేక కష్టాలు పడుతున్న రైతుల గోస తప్పక తగులుతుందని భట్టి అన్నారు. మరోవైపు మహిళలకు ఇచ్చే పావుల వడ్డీ రుణాలకు, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంగళం పాడిందని భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మహస్తం పథకం అటకెక్కించి రేషన్ దుకాణాలను.. బియ్యం దుకాణాలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన రెండు లక్షల పదహారువేల రూపాయల బంగారు తల్లి పథకాన్ని చంపేసి.. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఏదో తన జేబులో నుండి మహిళలకు లక్ష రూపాయలు ఇస్తున్నట్టు నటించడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వితంతువులకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టె సమయం ఈ ఎన్నికల ద్వారా వచ్చిందని బట్టి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని.. భయపెట్టి ఓట్లు యాచిస్తున్న అవినీతి ప్రభుత్వం కావాలో.. రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న కాంగ్రెస్ ప్రభత్వం కావాలో.. నిర్ణయిం మీ చేతిలో ఉందని ఓటర్లను ఉద్దేశించి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్న భట్టి.. నేతల అవినీతికి అడ్డుకట్ట వేస్తే చాలని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు..