రైతు రుణమాఫీ ఆలస్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramrka) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. బషీర్ బాగ్(Basheerbagh) ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘విద్యుత్-తాగునీరు-ఆర్థికం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే మీడియా ముందుకొచ్చినట్లు చెప్పారు. తప్పకుండా రుణమాఫీ చేసి చూపిస్తామని తెలిపారు.
సాగునీరు, విద్యుత్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే ప్రచారం చేయడం సరికాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్పష్టమైన విధానంతో కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుందన్నారు.
బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోగానే రూ.7వేల కోట్ల రాష్ట్ర ఖజానా ఉందని చెబుతున్నప్పటికీ నిజానికి ఖజానాలో ఉన్నది మైనస్ రూ.3,960కోట్లు అని తెలిపారు. రూ.7వేల కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్లాయని ప్రశ్నించారు. నాలుగు నెలల్లో రూ.26వేల కోట్ల అప్పులు కట్టామని తెలిపారు. 93శాతం మంది రైతులకు రైతుబంధు అందించామని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి 1,125 కోట్లు విడుదల చేసి ఆర్టీసీకి నిధులను మంజూరు చేసామన్నారు.
గృహలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్‌కు అవసరమైన నిధులను మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీకి రూ.60కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో పవర్ సబ్సిడీ రూ.3.92కోట్లు మంజూరు చేసామని, రైస్ సబ్సిడీ కింద రూ. 1,147 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. రైతుబీమాకు రూ.734కోట్లు ప్రీమియంగా చెల్లించామన్నారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ఇన్సూరెన్స్ చేశామని తెలిపారు.
రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్, మరికొన్ని మార్గాల ద్వారా విద్యుత్‌ను అందించేలా కొత్త ప్రతిపాదనలను అన్వేషిస్తున్నామన్నారు. విభజన చట్టం చేసిన ప్రతిపాదనాలకు అనుగుణంగా అమలు జరిగితే తెలంగాణకు చాలా ఉపయోగంగా ఉండేదన్నారు. బీఆర్ఎస్ కరెంటు తయారు చేసి ప్రజలకు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చిన ధరలను వారే నిర్ణయించుకొని ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. తాము రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు.
29 నుంచి 30 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రతి పాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు అంతరాయం గానీ ఇబ్బంది గానీ లేదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా స్వల్ప సమయం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పేద వాడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో పాటు రైతులకు న్యాయం చెయ్యడమే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవంతో పరిపాలన కొనసాగిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.