కాళేశ్వరం పై అసెంబ్లీలో ఆదివారం సీఎం కేసీఆర్ (KCR), సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు సాగాయి. ముఖ్యంగా కాళేశ్వరం (Kaleswaram)పైనే వాగ్యుద్ధం జరిగింది. కాళేశ్వరమే లేకపోతే కొండపోచమ్మ, రంగనాయక సాగర్ కు నీళ్లెక్కడివని… ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీకి ఏడుపెందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టే లేకుంటే తుంగతుర్తికి, సూర్యాపేటకు నీళ్లెక్కడివని కూడా అన్నారు . వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తెలంగాణాలో ప్రగతిపై చర్చకు సమాధానమిచ్చిన సందర్భంగాకూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
కాగా-కాళేశ్వరంలో పంప్ చేసే నీటికంటే సముద్రం లోకి వదిలే నీళ్ళే ఎక్కువ అవుతున్నాయని, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడం అనుకున్న స్థాయిలో జరగడం లేదని మొదట భట్టి ఆరోపించారు. అదనపు ఆయకట్టును డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా ఎంతకాలంలో తీసుకొస్తారని ప్రశ్నించిన ఆయన.. ఈ కాలువలను ఏర్పాటు చేసి అదనపు ఆయకట్టును తీసుకురావాలన్నారు. ఎన్ని లక్షల అదనపు ఆయకట్టును తీసుకొస్తారో స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నక్కలగండి, ఎస్ఎల్బీసీ టన్నెల్, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు సాఫీగా సాగడం లేదని కూడా ఆరోపించారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
భట్టి చేసిన ఆరోపణలను ఖండించిన కేసీఆర్.. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పరిస్థితి రాంరాం అన్నారు. కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది.. ఆ పార్టీ హయాంలో 35 వేల చెరువులు మాయమైపోయాయి. మన్యం కష్టాలు ఆ పార్టీ సృష్టించిందే .. విలీన సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుంటే చూస్తూ కూర్చున్నదెవరు అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలు కాదు.. అసలు కరెంటే రాదన్నారు. అనేక ఒప్పందాలను కాలరాచినా కాంగ్రెస్ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారని, 1969 లో తెలంగాణ ఉద్యమాన్ని ఆ పార్టీ ఉక్కుపాదంతో అణచివేసిందని, ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు పోయాయన్నారు.
నీటి తీరువాను మెడపై కత్తి పెట్టి వసూలు చేసిన ‘ఘన చరిత్ర’ ఆ పార్టీదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నాడు ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ఏపీ కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం లక్ష ఎక్కువగా ఉందని, ఓ ప్రవచనకారుడిలా భట్టి తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, నిజానికి దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. దళారి వ్యవస్థకు, అక్రమాలకు తావు లేకుండా ఈ వ్యవస్థను తెచ్చామని ఆయన చెప్పారు.