భీమవరం (Bhimavaram) రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు, దీపావళి పటాసుల్లా పేలగా.. ఆ మాటలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (MLA Grandhi Srinivas) మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా భీమవరంలో గెలిచి తీరాలనే ఆశతో తనపై రౌడీ అనే ముద్రవేసి మతి తప్పినట్లు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు..
చంద్రబాబు (Chandrababu) రాసిచ్చిన స్క్రిప్ట్‌తో పవన్ రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ మానసిక స్థితి ఏంటో అర్థం కావడం లేదని, ఆయన మంచోడైతే.. జేడీ లాంటి మేధావులు ఎందుకు దూరం అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. తనపై కోపం లేదని గత నెలలో భీమవరంకు వచ్చినప్పుడు అన్నారని… ఇప్పుడేమో తనను రౌడీ అంటున్నారని, ఒక్క సారి తన గతం తెలుసుకొని మాట్లాడాలని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
జనసేన పార్టీ కార్యాలయానికి భీమవరంలో స్థలం ఇవ్వకుండా తాను అడ్డుకున్నారని పవన్ ఆరోపించారు. ఇదంతా కావాలనే తనను చులకన చేయడానికి మాట్లాడిన మాటలుగా గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.. పవన్‌కు స్థలం కావాలంటే.. తన భూమి నుంచి ఇచ్చేవాడినని తెలిపారు. తన మీద పవన్ కు ఎందుకంత అసూయ అనేది తనను అర్థం కావడం లేదని అన్నారు.. పవన్ నిజ స్వరూపం తెలియని అభిమానులు ఆయనను సీఎం సీఎం అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారని అన్నారు.
కానీ పవన్ (Pavan) మాత్రం 21 సీట్లకే పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు రాజకీయాల్లో చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు అసలు పోలికే లేదని విమర్శించారు.. ఎన్నికల్లో పోటీ చేసి చిరంజీవి 18 సీట్లు గెలిచారని.. పవన్ మాదిరి విమర్శలు చేయలేక రాజకీయాల నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు.. సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేసి రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు..