తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే వేడుకల్లో తొలిరోజు భోగి(Bhogi) వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని ఆటపాటలతో సందడి చేశారు.
హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో ప్రజలు సంక్రాంతి శోభ ఉట్టిపడింది. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక, నగరిలో మంత్రి రోజా నివాసంలో భోగి వేడుకలు జరిగాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ రామచంద్రాపురంలో భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు, శివబాలజీ పాల్గొన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక సాంగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.
సంబరాల రాంబాబునే: అంబటి
సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి సంబురాల్లో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ సంబురాల రాంబాబు అంటున్నారు.. సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే.. సంక్రాంతి దాడితే నేను పొలిటికల్ రాంబాబుని.. సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో.. రాజకీయాలు అంత సీరియస్గా చేస్తాను.. సత్తెనపల్లిలో ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలన్నదే నా ఆలోచన’ అని అంబటి అన్నారు.
అంబటి నాలుగేళ్లుగా ఏటా భోగి మంటల వద్ద సందడి చేస్తున్నారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులేస్తున్నారు. గతేడాది ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.