Biden : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ రానున్నారు. సెప్టెంబరు 7 నుంచి 10 వరకు ఢిల్లీ (Delhi) లో జరగనున్న జీ-20 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆయన ఇండియాకు వెళ్లనున్నారని వైట్ హౌస్ (White House) వెల్లడించింది. జీ 20 కూటమికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోడీ (Modi) ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించనున్నారని పేర్కొంది. తన భారత పర్యటన సందర్భంగా ఆయన వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్ వార్ సహా పలు ప్రపంచ సమస్యలపై ఆయా దేశాల అధినేతలతో చర్చించనున్నారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
కూటమి లోని సభ్య దేశాల మధ్య ఆర్ధిక సహకారాన్ని పెంపొందించుకునే విషయంపై కూడా బైడెన్ చర్చిస్తారని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. 2026 లో జీ 20 కూటమికి అధ్యక్షత వహించేందుకు అమెరికా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, ప్రపంచ బ్యాంక్ తో సహా బహుళార్థ బ్యాంకుల సామర్థ్యం పెంపు, పేదరిక నిర్మూలన వంటి ఇతర అంశాలపై సైతం బైడెన్ చర్చించే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జీ 20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబరు 9, 10 తేదీల్లో హస్తినలో జరగనుందని, ఈ సమావేశాలకు 29 దేశాల అధినేతలతో బాటు ఐరోపా సమాఖ్య ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా ఇండియా తమకు అత్యంత ముఖ్యదేశమని బైడెన్ వ్యాఖ్యానించినట్టు భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బైడెన్ పలు మార్లు ప్రశంసిస్తుంటారని ఆయన చెప్పారు.