తెలంగాణ రాజకీయాలు మహా సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి నేతలు.. ఆశల నిరాశాల మధ్య ఊగిసలాడుతున్నారని అనుకుంటున్నారు. వెంట ఉంటూనే వెన్నుపోటులకి రాజకీయాలు వేదిక అవుతున్నాయని ప్రచారం.. మరోవైపు బీసీ (BC) మంత్రం రాష్ట్రమంతా బీసీలు జపిస్తుండగా.. బీజేపీ (BJP) అయితే ఏకంగా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి (CM) చేస్తామని ప్రకటించింది.
ఈ నేపధ్యంలో మైనంపల్లి (Mainampally)కి అత్యంత సన్నిహితుడైన ప్రభాకర్ గౌడ్ (Prabhakar Goud) బీజేపీలోకి జంప్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకి ఎక్కువ సమయం లేని వేళ మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని విషయాన్ని ఎరిగిన వారు అనుకుంటున్నారు. నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా ముద్రపడ్డ నక్క ప్రభాకర్ గౌడ్ పార్టీ మారితే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లు తారుమారు అవుతాయనే అనుమానాలు మొదలైయ్యాయి..
ఇప్పటి వరకు మైనంపల్లికి నీడలా ఉన్న నక్క ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి కాంగ్రెస్ (Congress)లోకి మారే సమయంలో ఆయన కుమారుడుతో పాటుగా నక్క ప్రభాకర్ గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడని పేరున్న తోటకూర వజ్రెష్ యాదవ్ కు మేడ్చల్ టికెట్ కేటాయించడంతో, పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి హామీతో సమిష్టిగా పనిచేసేందుకు నక్క ప్రభాకర్ గౌడ్ సిద్ధపడ్డారు.
కానీ ప్రభాకర్ బీజేపీలో చేరితే ఏకంగా మేడ్చల్ నియోజకవర్గం (Medchal Constituency)లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామనే బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు నక్క ప్రభాకర్ గౌడ్ సైతం బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మారెందుకు అభ్యంతరం లేదని అన్నట్టు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇదే గనుక జరిగితే మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు..