ఢిల్లీ లిక్కర్ స్కాం(liquer scam) కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత (Mlc Kavita) తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. మొన్నటివరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement directorate) తనపై అక్రమంగా కేసును బనాయించి అరెస్టును చేసిందని ఆరోపించిన కవిత.. సుప్రీంకోర్టు (Supream court)లో సవాల్ చేస్తానని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె తరఫు లాయర్లు రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
అయితే, మంగళవారం తను వేసిన రిట్ పిటిషన్‌ను కల్వకుంట్ల కవిత విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవితను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసినందున ఇప్పుడు రిట్ పిటిషన్‌ను విచారించి లాభం లేదని, అది నిరర్ధకంగా మారిందని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తోంది. అందుకే తాము వేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత తరఫు లాయర్లు న్యాయమూర్తికి విన్నవించగా వారు అంగీకరించి.. కేసును 11 గంటలకు పాస్ ఓవర్ చేశారు.
ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈనెల 15వ తేదిన ఈడీ అధికారులు హైదారాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి సాయంత్రం 5.30 గంటలకు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. 16వ తేదిన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా కోర్టు వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి అప్పగించింది. దీనికి తోడు సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులను కలుసుకునేందుకు టైం ఇవ్వడంతో పాటు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతిని మంజూరు చేసింది.
అంతటితో ఆగకుండా కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కవిత లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్‌కు పాల్పడటంతో పాటు సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆమెపై ఈడీ ప్రధాన అభియోగాలను మోపింది. లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి కవితే అని ఈడీ తరఫు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు.