బీహార్ (Bihar) రాజకీయాలు నాటకీయ పరిణామాల మధ్య రసవత్తరంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని జేడీయూ అధ్యక్షులు, ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) నిర్ణయించుకున్నాడు. మళ్లీ పాత మిత్రుడు బీజేపీ (BJP)తో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. కమలంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీంతో బీహార్ రాజకీయాల్లో బిగ్ సండే కాబోతుంది.
మరికొన్ని గంటల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే ఇదే సమయంలో నితీష్ కు, బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తుకు ముందే జేడీయూ చీఫ్‌కు షరతులు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. గోడ మీది పిల్లిలా వ్యవహరించే నితీష్ విషయం తెలిసిన బీజేపీ అధిష్టానం.. తొలుత సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మద్దతు లేఖను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసిన తర్వాతే ఇస్తామని నితీష్‌కు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఊహించని పరిణామంతో సీఎం నితీష్ కుమార్, జేడీయూ శ్రేణులు కంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం నితీష్ కుమార్ నివాసంలో నేడు జేడీయూఎల్పీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ అనంతరం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
అనంతరం బీజేపీ మద్దతుతో సీఎంగా నితీశ్ సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాజా రాజకీయ నిర్ణయంతో, దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికారమే ముఖ్యమనే తీరులో వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్ పై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇక నేటితో ఇక్కడి రాజకీయ పరిణామాలు క్లైమాక్స్‌కు చేరగా.. బీహార్ మహాకూటమి ప్రభుత్వం కూలిపోతుందని అనుకొంటున్నారు..