బిల్కీస్ బానో (Bilkis Bano)కేసులో భారత సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు క్షమాబిక్ష పెట్టే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ఈ కేసులో 11 మంది నిందితులకు గుజరాత్ ప్రభుత్వం పెట్టిన క్షమాబిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.
ఈ కేసులో గతేడాది అక్టోబర్ 12న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వులో పెట్టింది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన దర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిది. వాస్తవాలను తప్పుదోవ పట్టించి, క్షమాపణల కోసం దోషులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారని వెల్లడించింది. ఈ కేసులో దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది.
ఇది నేరపూరత చర్య అని మండిపడింది. ఈ కేసులో బాధితురాలి హక్కును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
బిల్కీస్ బానో కేసులో దోషులను మహారాష్ట్రలో శిక్ష విధించారని అందువల్ల ఈ కేసులో క్షమాబిక్ష పెట్టే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో నిందితులు రెండు వారాల్లోగా లొంగి పోవాలని ధర్మాసనం ఆదేశించింది.
2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కీస్ బానో ఘటన వెలుగులోకి వచ్చింది. బిల్కీస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన ఏడుగురు కుటుంబ సభ్యులను దుండగులు హత మార్చారు. ఈ కేసులో 2008 జనవరి 21న 11 మంది దోషులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆ తర్వాత నిందితులకు గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది.దీనిపై దుమారం రేగింది. దీనిపై బాధితురాలితో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.