దూర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పని పరిస్థితుల్లో బయట విక్రయించే తినుబండారాలు కొనుగోలు చేయాల్సివస్తుంది. అయితే, రైళ్లలో విక్రయించే ఫుడ్ ఐటమ్స్ ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. రైలు(Train)లో బిర్యానీ(Biryani), ఇతర తినుబండారాలు తిని తొమ్మిది మంది వరకు అస్వస్థత(Sick)కు గురయ్యారు.
విశాఖ రైల్వేస్టేషన్(Visaka Railway Station)తో పాటు పలు రైళ్లలో బిర్యానీ, ఇతర ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేసి ఆరగించిన వారు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. రైల్వే అధికారులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్నా-ఎర్నాకుళం(Patna-ernakulam) ఎక్స్‌ప్రెస్‌లో సేలంకు వెళ్తున్న 15మంది కార్మికులు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో బిర్యానీలు కొనుగోలు చేశారు.
అయితే, ఆ బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో రైల్వే సిబ్బంది రైలు మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైల్వే సిబ్బంది, పోలీసులు సిద్ధంగా ఉండి.. వారిని రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు.
మరో ఘటనలో.. దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలులో ఎగ్ బిర్యానీలు కొనుగోలు చేసి తిన్నారు. వారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. వారిలో నలుగురిని రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దించి ఆస్పత్రికి తరలించారు. ఇలా మొత్తంగా రైళ్లలో బిర్యానీ తిని ఒకే రోజు 9 మంది ఆస్పత్రిలో చేరారు.