Telugu News » Kishan Reddy : కాంగ్రెస్ కు కేసీఆర్ ఆర్థిక సాయం..!

Kishan Reddy : కాంగ్రెస్ కు కేసీఆర్ ఆర్థిక సాయం..!

కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో నిరుద్యోగులను, ప్రతిపక్షాలను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

by admin
BJP 24 Hours Deeksha At Indira Park

బీఆర్ఎస్ (BRS) విధానాల వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. కిషన్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది మంది నిరుద్యోగులు తిండి లేక ఉన్నారని అన్నారు. వారికి సంఘీభావంగా ఈ ఉపవాస దీక్షకు దిగినట్టు తెలిపారు. తెలంగాణ యువత రాష్ట్రం కోసం పోరాడిందని.. కానీ వారి పట్ల కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వివక్ష చూపుతోందని ఆరోపించారు.

BJP 24 Hours Deeksha At Indira Park

1969 కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ హయాంలో 300 మంది యువతను కాల్చి చంపారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రం కోసం చదువులు మానేసి గజ్జె కట్టి యువత పోరాటం చేసిందన్నారు. తెలంగాణ కోసం 12వందల మంది బలిదానం చేసుకుంటే.. కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తి పెట్రోల్ పోసుకుంటే ఇంతవరకూ ఆయనకు అగ్గి పెట్టె దొరకలేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని యువత భావిస్తే.. దానికి రివర్స్ లో పాలన సాగుతోందని విమర్శించారు.

‘‘విశ్వవిద్యాలయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్స్ లో పందికొక్కులు ఉంటున్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టు కేసులతో ప్లాన్ ప్రకారం నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. అప్పులు చేసి లక్షల రూపాయల ఖర్చుతో పరీక్షలకు ప్రిపేర్ అయితే.. పేపర్ లీకేజీ చేస్తున్నారు. యువత జీవితాలను ఆగం చేశారు. వారికోసం పోరాటం చేసిన బండి సంజయ్ లాంటి వారిని అరెస్టు చేశారు. 9 ఏళ్లుగా డీఎస్సీ భర్తీ చేయలేదు. కేసీఆర్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. నిరుద్యోగ భృతి ఏమైంది? తెలంగాణ నిరుద్యోగ యువతకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య పాపం మీది కాదా? హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని చెప్పలేదా? జీతం కోసం మాట్లాడి అవమానంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు రవీందర్. దీనిపై మీ సమాధానం ఏంటి?’’ అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

మూతపడ్డ పరిశ్రమలను రీ ఓపెన్ చేస్తామని చెప్పి ఏం చేశారని అడిగారు. తెలంగాణలో పరిశ్రమ పెట్టాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటాలు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో మీ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లా నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 70నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. మోడీకి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వానికి లేదని విమర్శలు చేశారు.

కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో నిరుద్యోగులను, ప్రతిపక్షాలను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ‘‘యూనివర్శిటీ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆందోళన చేస్తే లాఠీ ఛార్జ్ చేస్తారా? కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇష్టారాజ్యంగా విద్యార్థుల్ని కొట్టారు. ఇదెక్కడి న్యాయం? కేసీఆర్ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యల మీద నిరంతర పోరాటం చేస్తున్న యువ మోర్చా నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో ఉన్న జైళ్లను నింపినా భయపడేదే లేదన్నారు. గురువారం ఉదయం వరకు దీక్షను కొనసాగిస్తామని తెలిపారు కిషన్ రెడ్డి.

You may also like

Leave a Comment