రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అంటారు. ఇక్కడ బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి. ఇది నిజమని నిరూపించే ఘటనలు రాజకీయాల్లో కోకొల్లలు.. ప్రస్తుతం ఇలాంటి చిత్రమే జరిగింది. నిన్నటి వరకు బీజేపీ (BJP) అధిష్టానం తనకు టికెట్ కేటాయించలేదని నటుడు (Actor) బాబూమోహన్ (Babu Mohan) వలవల విలపించిన విషయం తెలిసిందే.. పార్టీలో ఉండాలా వద్దా అనే దగ్గరికి మ్యాటర్ కూడా వచ్చింది. కానీ తెరవేనక ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా బాబూమోహన్‌ను అందోలు అభ్యర్థిగా (Andolu candidate) బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో అందోలు ఆందోళన తొలగినట్టు అయ్యిందని బాబూమోహన్ అభిమానులు సంబరపడుతున్నారు.
మరోవైపు బీజేపీ పార్టీ 35 మందితో కూడిన మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో అందోల్ బీజేపీ అభ్యర్థిగా బాబూమోహన్‌ను పేరు ఖారారు చేయడంతో.. సోషల్ మీడియాలో బాబూమోహన్ మ్యాటర్ లో జరుగుతున్న రచ్చకు తెరదించినట్టు అయ్యిందని అనుకుంటున్నారు. ఇక సినీ నటుడుగా ఉన్న బాబూమోహన్ 1998 ఉప ఎన్నికలలో అందోలు నియోజకవర్గం నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.
టీడీపీ తరఫున పోటీ చేసిన బాబూమోహన్ విజయం సాధించాడు. మరోసారి ఎమ్మెల్యేగా 1999లో గెలిచి, చంద్రబాబు సారధ్యంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా 2004, 2009లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్(BRS)లో చేరి 2014లో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరిన బాబూమోహన్.. క్రాంతికిరణ్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు బాబూమోహన్ పేరు తొలిజాబితాలో లేకపోవడంతో బీజేపీ టిక్కెట్ నాకొద్దని.. ఈ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇది జరిగిన ఐదు రోజులకు అధిష్టానం విడుదల చేసిన మూడో జాబితాలో బాబూమోహన్ పేరు ప్రకటించడం గమనార్హం.