Telugu News » Eatala Rajender : రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

Eatala Rajender : రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

సర్పంచులకు పనిచేసిన బిల్లులు రావడం లేదు.. పైరవీలు చేసుకున్న వారికి మాత్రమే ఇస్తున్నారు.

by admin
bjp

– కేసీఆర్ కు బై బై చెప్పే టైమ్ వచ్చింది
– ఆరిపోయే దీపంలా బీఆర్ఎస్ సర్కార్
– ఎంఐఎం మిత్రపక్ష అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?
– హర్యానా, పంజాబ్ లో డబ్బులు పంచే కేసీఆర్ కు…
– రాష్ట్ర రైతులు కనిపించడం లేదా?
– ప్రభుత్వం ల్యాండ్ బ్రోకర్ గా మారడమేంటి?
– అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు..
– సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తాం
– కేసీఆర్ సర్కార్ పై ఈటల ఫైర్

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఆశపడతామని.. కానీ, కేసీఆర్ (KCR) కి చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లిందనడానికి మొన్నటి సమావేశాలే సాక్ష్యమన్నారు బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender). ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు కేవలం 11 రోజులు మాత్రమే జరిగాయని.. వర్షాకాల సమావేశాలు ఒకరోజు సంతాప ప్రకటన తీసేస్తే మూడు రోజులు మాత్రమే జరిగాయని తెలిపారు. మళ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేదని స్పీకర్ గారు చెప్పకనే చెప్పారన్న ఆయన.. ఈ సంవత్సరం శాసనసభ (Assembly) సిట్టింగ్ డేస్ 14 రోజులు మాత్రమేనని అన్నారు. ఎన్ని రోజులు అయినా చర్చ జరగడానికి సిద్ధంగా ఉన్నాం అభ్యంతరం లేదు అని చెప్పే కేసీఆర్ ఎందుకు ఇన్ని తక్కువ రోజులు నడిపారో ప్రజానీకమంతా ఆలోచన చేయాలని కోరారు.

bjp

సమైక్య రాష్ట్రంలో 13, 14 పార్టీలు శాసనసభలో ఉండేవని.. కానీ, ఇప్పుడు 4 పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు రాజేందర్. అప్పుడు 13 పార్టీలు ఉన్న ఇదే శాసనసభలో అన్ని పార్టీల ప్రతినిధులను బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశానికి పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ కు ఎందుకంత అక్కసో అర్థమవుతోందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎంఐఎం తమ మిత్రపక్ష పార్టీ అని చెప్పిన తర్వాత.. దానికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద, చట్టసభల మీద విశ్వాసం లేదు కాబట్టి మమ్మల్ని మాట్లాడనీయడం లేదని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలతో కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయ్ బాయ్ చెప్పినట్లుగా, వీడ్కోలు ప్రకటించినట్టుగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. వరదల వల్ల 41 మంది చనిపోతే ప్రస్తావన తేలేదు, సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్.. అని కేసీఆర్ చెప్పుకుంటూ హర్యానా, పంజాబ్ లో డబ్బులు పంచుతున్నారని.. ఎవడబ్బ సొమ్మని అక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు.

‘‘తెలంగాణలో రైతు చనిపోతే 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని కేసీఆర్ చెప్తున్నారు. అందులో 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. కానీ, వరదల వల్ల చనిపోయిన వారికి, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక రూపాయి ఇవ్వకపోవడం అంటే ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇల్లు మునిగిన వారికి 25 వేలు, షాపులకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం సోయి తెచ్చుకుని స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. వాగుల పక్కన ఉన్న భూముల్లో తాటిచెట్టు అంత లోతు గోతులు పడ్డాయి. ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి’’ అని వివరించారు.

110 సీట్లతో గెలుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అహంకారానికి నిదర్శనమన్నారు రాజేందర్. ‘‘ఓట్లు వేసి గెలిపించాల్సింది జనం. వారి అంతరంగం, వారి హక్కుని కూడా ప్రకటించుకోవడం అంటే ప్రజల పట్ల ఏం భావన ఉందో అర్థం అవుతోంది. ప్రజలు దీన్ని గమనించాలి. అసెంబ్లీలో ఒక రోజంతా హరీష్ మాట్లాడతారు. దేశంలో మాకంటే తెలివైన వారు లేరు అన్నట్టు మేమే అన్నింటిలో నెంబర్ వన్ అని చెప్తారు. రెండోరోజు కేటీఆర్ వచ్చి మాట్లాడుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారి వయసుకు, అనుభవానికి గౌరవం లేకుండా ర్యాగింగ్ చేసినట్లు మాట్లాడుతారు. చివరి రోజు ముఖ్యమంత్రి ప్రసంగం ఏం చెయ్యడానికి లేవు అన్నీ మేమే చేశామని చెప్పుకుంటారు’’.. ఇంతేనా సమావేశాలు నిర్వహించే తీరు అంటూ మండిపడ్డారు.

2019 నుంచి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఎలా నెంబర్ వన్ అవుతుందని కాగ్ రిపోర్ట్ తో బయటపడిందని అన్నారు ఈటల. రుణం తీసుకున్న దానిలో క్యాపిటల్ ఎక్స్పెండెచర్ జరగటం లేదని రిపోర్ట్ చెప్పిందని తెలిపారు. బడ్జెట్ కొండంత, ఖర్చు పెట్టేది గింతంత అని కాగ్ చెప్పిందన్నారు. సెన్సిటివిటీ ఉన్న ప్రభుత్వం, మాట అంటే బాధపడే ప్రభుత్వమైతే కాగ్ రిపోర్టు మీద స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపమని చురకలంటించారు. ‘‘అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయని సీఎం అంటున్నారు. మీరు వేసిన ఏ అస్త్రం పాస్ కాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కొక్కరికి ఇవ్వాలంటే 2 లక్షలు ఇవ్వాలి. అప్పుడు 30 లక్షల మందికి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి. 27 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాననని ఇచ్చింది 1200 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 27 వేల కోట్ల రూపాయలకు 11 శాతం వడ్డీ పడింది. వేల కోట్ల రూపాయల వడ్డీ తోడైంది ఇవన్నీ ఎవరు కట్టాలి. బ్యాంకులలో రైతులకు రుణాలు దొరకకుండా చేశారు. షావుకారుల దగ్గర వడ్డీ తీసుకువచ్చే దుస్థితికి కారకులు ముఖ్యమంత్రి కాదా’’ అంటూ నిలదీశారు రాజేందర్.

రాష్ట్రంలో నెలకు 4 వేల కోట్లు అసలు, వడ్డీ కట్టడానికి పోతాయి, 4 వేల కోట్ల రూపాయలు జీతాలకు, మరో 4 వేల కోట్లు రైతుబంధు, ఆసరా, కల్యాణ లక్ష్మి, కరెంటు బిల్లులు పోతాయి. 16 వేల కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తే 12 వేల కోట్ల రూపాయలు వీటికి పోతాయి. మరి, ఎలా 27 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారు. దీని మీద చర్చ పెడదామా? అని సవాల్ చేశారు ఈటల. సర్పంచులకు పనిచేసిన బిల్లులు రావడం లేదు. పైరవీలు చేసుకున్న వారికి మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘హైదరాబాద్ గొప్పతనాన్ని ఒప్పించడానికి 100 కోట్ల రూపాయలు ఎకరం అమ్ముడు పోయింది, రియల్ ఎస్టేట్ గొప్పగా ఉందని డబ్బా కొట్టుకోవడానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోకాపేటలో 100 కోట్ల రూపాయల విలువ పెరిగినప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 50 లక్షల రూపాయల ఎకరం పెరిగినప్పుడు.. ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు దళితుల పేదల భూమిని ఎవరబ్బా జాగీరని 20 లక్షల రూపాయలు ఇచ్చి సేకరించి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ బ్రోకర్ గిరి చేయాలా? అంటూ నిలదీశారు. దళితులకు ఇచ్చిన భూమి ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలకు, తమిళనాడులో 15 సంవత్సరాల తరువాత అమ్ముకునే అవకాశం ఇస్తున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదిక మీద ప్రకటించిన తర్వాత కూడా ఇవ్వడం లేదన్నారు. ధరణి పేదల కోసం రాలేదని.. ఇదేం గొప్ప సంస్కరణ కాదని చెప్పారు. ధరణితోని వేల ఎకరాల అన్ ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. డిస్ప్యూటెడ్ ల్యాండ్ పేరు చెప్పి బ్రోకర్లతో మంతనాలు జరిపి భూములు స్వాధీనపరుచుకుంటున్నారని.. ఇది సిగ్గులేని, హీనమైన ప్రభుత్వమంటూ ఫైరయ్యారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉటుందని.. అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు కాబట్టి.. సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment