Telugu News » కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది!

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది!

by admin
bjp-mla-etela-rajender-key-press-meet-on-telangana-assembly-session-2023

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన ఆయన సమావేశాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. అందుకే, అన్ని వర్గాలను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ, ఆయన్ను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.

bjp-mla-etela-rajender-key-press-meet-on-telangana-assembly-session-2023

అసెంబ్లీలో తమకు రూం ఇవ్వకపోవడం, బీఏసీ సమావేశానికి పిలవకపోవడంపై మండిపడ్డారు రాజేందర్. ఇది తమను కాదు.. అసెంబ్లీనీ అవమానించడమని చెప్పారు. పైగా, మూడు రోజులపాటే అసెంబ్లీ జరపడం అంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన స్పీకర్ తీరు సరిగ్గా లేదన్నారు. ఇలాంటి రాజ్యం చెల్లబోదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రశాంతత లేదనడానికి రోజూ తమ దగ్గరకు వస్తున్న ప్రజలే నిదర్శనమన్నారు ఈటల. రోజూ వందల మంది కలిసి తమ బాధలు చెబుతున్నారని.. వాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావించమని అడిగారని వివరించారు. కానీ, చాలా తక్కువ రోజులే సమావేశాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలున్నాయని చెప్పారు.

‘‘వరదలు వచ్చి లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. జనం, పశువులు కొట్టుకుపోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. నేను వరంగల్, హన్మకొండ, హుజూరాబాద్ లో పర్యటించా. బాధితుల బాధలు చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. ప్రజలకు అండగా పరిహారం ఇవ్వాలి. కేసీఆర్ వల్లే మంచిర్యాల మునిగిపోయింది. కాళేశ్వరం కట్టకముందు సుభిక్షంగా ఉన్నామని జనం అంటున్నారు. చెక్ డ్యాముల వల్ల నీళ్లు వెనక్కి తన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. తక్షణమే దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు రాజేందర్.

కేసీఆర్ పాలనలో ఆర్టీసీ సర్వనాశనం అయిందన్నారు. ‘‘కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. బస్సులు ప్రైవేట్ పరం చేశారు. ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులపై కన్నేశారు’’ అని మండిపడ్డారు. సీఆర్పీల జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో 30వేలకు పైనే ఉన్న వారి జీతం తెలంగాణలో మాత్రం 19వేలే అని తెలిపారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment