తెలంగాణ(Telangana) ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఈ ఉచిత బస్సు(Free bus) ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహిళలకు ఉచిత ప్రయాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని కొందరంటుంటే మరికొందరు మాత్రం ఈ భారం వివిధ రూపాల్లో చివరికి ప్రజలపైనే మోపుతారని ఆరోపిస్తున్నారు.
అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Katipally Venkata Ramanareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే అలాంటి మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని ఆరోపించారు.
అదేవిధంగా ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్నా అందరూ బిచ్చగాళ్లేనని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఉచితం కావాలనుకునే వారికి ఉండాలి కానీ.. మీరు చెల్లించే సామర్థ్యం రూ.10 వేలు సంపాదించి కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకుంటే.. నా దృష్టిలో అడుక్కుంటున్నట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
భగవంతుడు చిన్న చూపుచూసి గుడి దగ్గర అమ్మా.. అయ్యా అంటూ అడుక్కునే వారితో సమానమంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. రేషన్ దగ్గర కక్కుర్తి పడేటోళ్ల శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లు. తినటానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే అని కాటిపల్లి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.