అయోధ్య (Ayodhya)లోని రామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడం, రాముడికి ప్రార్థనలు చేయడం చారిత్రాత్మకమని ఎంపీ సత్యపాల్ సింగ్ (Satya Pal Singh) అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడం, ప్రాణ ప్రతిష్ట గురించి పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
అయోధ్య రామమందిరంపై ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండేలతో కలిసి సత్యపాల్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ…. శ్రీ రామ్ అనేది మత పరమైన అంశం కాదని తెలిపారు. భగవాన్ రామ్ తమకు స్ఫూర్తినిచ్చే మూలం అని చెప్పారు.
శ్రీ రాముడు మర్యాద పురుషోత్తముడని అన్నారు. రాముడిపై చర్చ మనందరికీ ఒక ఆశీర్వాదం అని తెలిపారు. రాముడు మనకు ఒక అనుభూతి అని పేర్కొన్నారు. ఇది మన వారసత్వమన్నారు. శ్రీ రాముడు ప్రతి చోటా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నో ఏండ్ల భారతీయుల కల సాకారం చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు.
రాముల వారి ఆశీర్వాదంతో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని వెల్లడించారు. అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ…. రామమందిరం తమకు ఎప్పటికీ విశ్వాస కేంద్రంగా ఉంటుందన్నారు. రాముడు వస్తాడని బీజేపీ చెబుతోందని, కానీ తేదీ చెప్పడం లేదని కొందరు విమర్శలు చేశారని మండిపడ్డారు. వారికి సమాధానం ఇస్తూ తాము తేదీని ప్రకటించామని, మందిరాన్ని నిర్మించామన్నారు.